Exodus 23

1పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు. 2దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు. 3ఒక పేదవాడు న్యాయం కోసం పోరాడుతుంటే అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు.

4నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ, గాడిద గానీ తప్పిపోతే అది నీకు కనబడినప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని తోలుకు వచ్చి అతనికి అప్పగించాలి. 5నీ విరోధి గాడిద బరువు క్రింద పడిపోయి ఉండడం నువ్వు చూస్తే దాని పక్కనుండి దాటిపోకుండా వెంటనే వెళ్లి అతడితో కలసి ఆ గాడిదను విడిపించాలి.

6దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు 7అబద్ధానికి దూరంగా ఉండు. నీతిమంతుణ్ణి, దోషం లేనివాణ్ణి చంపకూడదు. అలాంటి చెడ్డ పనులు చేసేవాణ్ణి నేను దోషం లేనివాడిగా చూడను. 8లంచాలు తీసుకోవద్దు. చూపు ఉన్నవాణ్ణి లంచం గుడ్డివాడిగా చేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తుంది.

9విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.

10ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి. 11ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.

12ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసి కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి. 13నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు; అది నీ నోటి వెంట రానియ్యకూడదు.

14సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి. 15పొంగ జేసే పదార్థం లేని రొట్టెల పండుగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమిత సమయంలో ఏడు రోజుల పాటు పొంగ జేసే పదార్థం లేని రొట్టెలు తినాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో నిలబడకూడదు.

16మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండుగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకొని జనమంతా సమావేశమై పండుగ ఆచరించాలి. 17సంవత్సరంలో మూడు సార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో సమకూడాలి.

18నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. నా పండుగలో అర్పించిన కొవ్వు ఉదయం దాకా నిలవ ఉండకూడదు. 19నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.

20నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను. 21ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన క్షమించడు. ఎందుకంటే ఆయనకు నా పేరు పెట్టాను. 22మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.

23ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను. 24మీరు వారి దేవుళ్ళ ఎదుట సాష్టాంగపడ కూడదు, వారికి మొక్క కూడదు. వాళ్ళు చేసే పనులు చేయ కూడదు. వాళ్ళ విగ్రహాలను తుత్తునియలు చేసి వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి.

25మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తినే ఆహారం మీదా, తాగే నీళ్ళ మీదా ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు.

26మీ దేశంలో గర్భస్రావాలు ఉండవు. సంతాన సాఫల్యత లేని వాళ్ళు మీ దేశంలో ఉండరు. మీరు జీవించే రోజుల లెక్క పూర్తి చేస్తాను. 27నా పేరును బట్టి ఇతరులు మీకు భయపడేలా చేస్తాను. మీ ప్రయాణంలో మీరు దాటుతున్న సమస్త దేశ ప్రజలను ఓడించి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తాను.

28మీకు ముందుగా పెద్ద పెద్ద కందిరీగలను పంపిస్తాను. అవి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను మీ ఎదుట నుండి వెళ్ళగొడతాయి. 29అయితే ఒక్క సంవత్సరంలోనే వాళ్ళను వెళ్లగొట్టను. ఎందుకంటే దేశం పాడైపోతుంది. క్రూరమృగాలు విస్తరించి మీకు ప్రమాదకరంగా మారతాయి.

30మీరు వృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే దాకా వాళ్ళను కొంచెం కొంచెంగా మీ ఎదుట నుండి వెళ్ళగొడతాను.

31ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు. 32మీరు వాళ్ళతో గానీ, వాళ్ళ దేవుళ్ళతో గానీ ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు. వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మిమ్మల్ని చావుకు దగ్గరయ్యేలా చేస్తుంది. వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు.

33

Copyright information for TelULB